విజయవాడను మూడ్రోజులుగా అల్లాడించిన బుడమేరు కాస్త శాంతించింది. వరద మూడు అడుగుల మేర తగ్గింది. దీంతో నివాసాల నుంచి ఇప్పుడిప్పుడే జనం బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు అరుఅడుగుల మేర నీరు ప్రవహించింది. ఇప్పుడే కాస్త తెరపఇవ్వడంతో సహాయ చర్యలు చేపట్టారు. అజిత్‌సింగ్‌నగర్, పరిసర కాలనీల్లో మొబైల్ టవర్ లైట్లు ఏర్పాటుకు ఇంధన శాఖ అప్రమత్తమైంది. జనరేటర్ల ద్వారా వీధిదీపాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా రెండు రోజుల క్రితమే అధికారులు కరెంట్ నిలిపేశారు. కరెంటు ఇస్తే వరద కారణంగా ప్రజలు షాక్‌కు గురయ్యే ప్రమాదముంది.
కాస్త నెమ్మదించిన కృష్ణమ్మ
ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం గంటగంటకూ తగ్గుముఖం పడుతోంది. 11.43 లక్షల నుంచి 8.19 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు వదిలారు. గేట్లకు అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దాతల కోసం కౌంటర్ ఏర్పాటు…
వరద బాధితులను ఆదుకునేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తాత్కాలికంగా ఓ పాయింట్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ఆహారం, ఇతర వస్తువులు ఇవ్వాలనుకునే దాతల కోసం ప్రభుత్వం ఈ కౌంటర్ ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారి మన్‌జీర్ దీనిని పర్యవేక్షిస్తున్నారు. 79067 96105 ఫోన్ నంబర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.