సిపిఐ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 9మంది మావోయిస్టులు హతమయ్యారు.
నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టుల ఉనికి గురించి ఛత్తీస్‌గఢ్ పోలీసులకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆపరేషన్ మొదలుపెట్టారు. సిఆర్పిఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్టేట్పోలీస్కు చెందిన స్పెషలైజ్డ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్ విభాగాలు సంయుక్తంగా ఆపరేషన్ ఆరంభించాయి. జాయింట్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది.
ఈ ఉదయం దంతెవాడ-బిజాపూర్ సరిహద్దుల్లోని లోహగావ్ పీడియా ప్రాంతానికి పోలీసుల జాయింట్ టీమ్ చేరుకునేసరికి అక్కడున్న మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దానికి ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో హతమయ్యారు.
ఇప్పటివరకూ మావోయిస్టు యూనిఫారాల్లో ఉన్న తొమ్మిది మృతదేహాలు సంఘటనా స్థలంలో దొరికాయి. అక్కడ ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలురకాల ఆయుధాలు లభ్యమయ్యాయి. వాటిని జాయింట్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా జరుగుతోంది.
ఆగస్టు 29న అబూజ్మాఢ్ అటవీప్రాంతంలో ఇటువంటి ఆపరేషన్లోనే ముగ్గురు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. ఈరోజు జరిగిన ఆపరేషన్‌తో ఈ యేడాది ఇప్పటివరకూ హతమైన మావోయిస్టుల సంఖ్య 190 దాటిందని పోలీసులు వెల్లడించారు.