తెలుగు రాష్ట్రాలను వానలు ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
కుండపోత వర్షాలతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర యాతన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దాదాపు లక్షమందిని వరద నిరాశ్రయులుగా మార్చింది.
కృష్ణా నదీకి భారీగా వరద పోటెత్తడంతో పాటు బుడమేరు పొంగడంతో విజయవాడ గజగజలాడుతోంది. ప్రకాశం బ్యారేజీకి 11, 43,201 క్యూసెక్కుల వరద వచ్చింది. సోమవారం మధ్యాహ్నం గరిష్ఠ రికార్డు నమోదైంది. 1903 అక్టోబర్ 7న 11.90 లక్షల వరద వచ్చినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. 500 క్యూసెక్కులు కాలవకు వదిలి మిగతా వాటిని సముద్రంలో కలుపుతున్నారు.
ఇక తెలంగాణ పరిధిలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గతంలో లేనంతగా ఉగ్రరూపం దాల్చడంతో పరీవాహక ప్రాంతాల్లోని నివాసాలు నీట మునిగాయి. దీంతో రోజు గడవడటమే కష్టంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.