ఉత్తప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్లు ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోని పిల్లలపై తోడేళ్లు దాడి చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే పది మంది పిల్లలను తోడేళ్లు పొట్టనబెట్టుకున్నాయి. తోడేళ్లను ఏరివేసేందుకు యూపీ ప్రభుత్వం ఆపరేషన్ భేడియా ప్రారంభించింది. అయినా ఫలితం దక్కలేదు. గత రాత్రి తాజాగా తహసిల్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిని తోడేళ్లు చంపేశాయి. మనిషి రక్తం రుచిమరిగి తోడేళ్లు గ్రామాలపైపడి రాత్రి వేళలో చిన్నారులను ఎత్తుకెళుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి. ఏదో ఒక తోడేలు మనుషుల రక్తం రుచిమరిగి ఉండవచ్చని నార్వేకు చెందిన నిపుణులు అంచనా వేశారు.
తోడేళ్ల సంచరించే ప్రాంతం పరిమితంగా ఉంటుందని, అటవీ ప్రాంతంలో కుందేళ్లు దొరక్కపోవడంతో అవి గ్రామాల్లోని చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తోడేళ్లను బంధించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు.
తోడేళ్లు ముఖ్యంగా చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకోవడంతో బమరాయిన్ జిల్లాలో వందలాది గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చీకటి పడితే బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. కొన్ని గ్రామాల్లో యువకులు రక్షణగా రాత్రి వేళ్లల్లో గస్తీ ఏర్పాటు చేసుకున్నారు. ఏదో ఒక తోడేలు మాత్రమే దాడికి దిగుతోందని భావిస్తున్నారు. బమరాయిన్ జిల్లాలో తోడేళ్లతో కుక్కలకు సంక్రమణం చేయించి, వాటిని పెంచుకుంటున్నారని, వాటికి మనుషులంటే భయం లేకుండా పోయిందని తెలుస్తోంది. సహజంగా మనుషులను చూస్తేనే దూరంగా పరుగులు తీసే తోడేళ్లు చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.