జైలు గోడలు బద్దలు కొట్టే క్రమంలో 129 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాంగోలోని మకాల జైలులో చోటు చేసుకుంది. జైలు గోడలు బద్దలు కొట్టి పారిపోయే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 129 మంది చనిపోయినట్లు కాంగో ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ అంతర్గత మంత్రి షబాని లుకో ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. 24 మంది మంటల్లో చిక్కుకొన్ని మరణించారని తెలిపారు.
ఖైదీలు సామూహికంగా గోడలు బద్దలు కొట్టే క్రమంలో వంట గదిలో ఏర్పడిన మంటల్లో చిక్కుకొని చనిపోయారని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. జైలు పరిపాలనా భవనం కూడా ధ్వంసమైందని మంత్రి షబాని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని కాంగో తెలిపింది. తప్పించుకునే ప్రయత్నం చేసిన వారే మరణించారని అధికారులు వెల్లడించారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన వారిని అక్కడ సిబ్బంది తుపాకులతో కాల్చి చంపినట్లు ఖైదీలు చెబుతున్నారు. భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయని సమీప ప్రాంతాల ప్రజలు మీడియాకు తెలిపారు.