తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం వదలడం లేదు. ప్రకాశం బ్యారేజీకి రికార్డు వరద చేరింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 11.45 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. 4 పడవలు, ఓ భారీ ఫంటు బ్యారేజీ గేట్ల వద్ద ఇరుక్కుపోయాయి. నీటి వేగానికి పడవలు గేటు కౌంటర్ వెయిట్‌కు తగిలి అది పగిలిపోయింది. ప్రస్తుతానికి గేట్లు ఎత్తడానికి వచ్చిన ఇబ్బంది లేదని జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు తెలిపారు. వరద తగ్గిన తరవాత బోట్లను తొలగించి, దెబ్బతిన్న గేటు కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ప్రకాశం బ్యారేజీ వరద క్రమంగా తగ్గుతోంది. సోమవారం సాయంత్రానికి 11.45 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా, మంగళవారం నాటికి అది 9 లక్షలకు తగ్గింది. అయితే మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉండటంతో వరద ముప్పు తొలిగిపోలేదు. 5,6 తేదీల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వరద ప్రమాదం పొంచి ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.శ్రీశైలం నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తగ్గుముఖం పటింది. బుడమేరు వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంపు ప్రాంతాల్లో వరద స్వల్పంగా తగ్గింది.