ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. బందీలను విడిపించాలంటూ లక్షలాది కార్మికులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. శనివారం నాడు ఆరుగురు బందీలను రఫా సమీపంలోని ఓ సొరంగంలో హమాస్ ఉగ్రవాదులు చంపివేసిన తరవాత ఇజ్రాయెల్ ప్రధానిపై వ్యతిరేకత పెల్లుబికుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి నెతన్యాహు కారణమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.
కార్మిక సంఘాల నిరసనల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. కార్మికులు సమ్మె విరమించేలా చేయాలని ఆయన లేబర్ కోర్టును ఆశ్రయించారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. కార్మికులు సమ్మె చేయడం అంటే బందీలను చంపిన వారికి మద్దతు పలకడమేనని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను ఇంగ్లాండ్ నిలిపేసింది. పాలస్తీనా సరిహద్దు నుంచి వైలదొలగేది లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. బందీలను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.