విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం చేయడానికి హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. వరద బాధిత ప్రజల కోసం విజయవాడలో 78 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసారు. సహాయక చర్యలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు.
కేంద్రం నుంచి విజయవాడకు ప్రత్యేకంగా పది ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటికే ఎన్‌టిఆర్ జిల్లాలో 8 ఎన్‌డిఆర్ఎఫ్, 10 ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదనీరు నిలిచి ఉండిపోయిన ప్రదేశాల నుంచి బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పవర్ బోట్లు, హెలికాప్టర్లు చేరలేని ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం డ్రోన్లను వినియోగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మూడు డ్రోన్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక్కో డ్రోన్ నుంచి సుమారు 10కేజీల పదార్ధాలు సరఫరా చేయవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే డ్రోన్ల వినియోగంలో పరిమితుల గురించి సమీక్షిస్తున్నారు. అవసరమైతే వినియోగించడానికి మరో ఐదు డ్రోన్లను సిద్ధంగా ఉంచారు.