భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ ప్రాంతంలో ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి దివీస్ సంస్థ సాయం చేస్తామంటూ ముందుకొచ్చింది. రోజుకు లక్షా 70వేల మందికి ఆహారం అందిస్తోంది. ఐదు రోజుల పాటు ఈ విధంగా ఆహారం అందజేస్తామని దివీస్ యాజమాన్యం ప్రకటించింది. దీనికి సుమారు రూ.2.5కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఆహారం తయారు చేసి అందించే బాధ్యతను ఇస్కాన్ అనుబంధ ‘అక్షయపాత్ర’ సంస్థ స్వీకరించింది. అక్షయపాత్ర వారు ఆహారం వండి ఇస్తే దానికయ్యే ఖర్చును దివీస్ భరిస్తుంది.
మరోవైపు, అక్షయపాత్ర సంస్థ ఇవాళ సోమవారం ఒకేసారి 3లక్షల ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. మంగళగిరిలోని అక్షయపాత్ర కిచెన్లో ఈ ఆహారాన్ని తయారుచేసి పంపించారు. తమ సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో ఆహార పదార్ధాలు తయారుచేయడం ఇదే రికార్డు అని సంస్థకు చెందినవారు చెబుతున్నారు.