మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ మధ్యాహ్నం అరెస్ట్ చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉద్యోగుల నియామకాలు, సంస్థ ఆస్తుల లీజులో రూ.100 కోట్ల అవినీతిపై అతనిపై కేసులు నమోదయ్యాయి. సోదాలు నిర్వహిస్తుండగానే అమానతుల్లా ఖాన్ ఎక్స్ వేదికలో పోస్ట్ పెట్టారు. తన అత్తగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ పోస్ట్ చేశారు.
అమానతుల్లా ఖాన్ అరెస్టును సంజయ్ సింగ్ ఖండించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈడీ ఆప్ నేతలను అరెస్ట్ చేస్తోందన్నారు. ఆరేళ్లుగా దర్యాప్తు చేస్తోన్న ఈడీ ఇంత వరకు ఆధారాలు సమర్పించలేకపోయిందని ఆయన విమర్శించారు. అమానతుల్లా ఖాన్ తరపు న్యాయవాది ఈడీకి లేఖ రాసినా స్పందించడం లేదని సంజయ్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మందలించినా ఈడీ పట్టించుకోవడం లేదన్నారు.