వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. తమిళనాడు, పంజాబ్, ఒడిషాల నుంచి 400 మంది గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. మరపడవలు, రెస్క్యూ పరికరాలతో సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. లంక గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో వారిని హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 5 హెలికాఫ్టర్లు లంక గ్రామాల ప్రజలను తరలిస్తున్నాయి. మరో 4 హెలికాఫ్టర్లను రప్పించారు.
ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద చేరింది. 70 గేట్లు ఎత్తి 11 లక్షల 23 వేల క్యూసెక్కుల వరద విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో ఇదే అతిపెద్ద వరద కావడం విశేషం. వరద ఇంకా పెరిగే ప్రమాదం ఉండటంతో లంక గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. సముద్రంలో అలలు పెరగడంతో నది నీరు వెనక్కు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వేలాది మంది లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.