వరద బీభత్సం కొనసాగుతోంది. అమరావతి రాజధాని గ్రామం హరిశ్చంధ్రాపురం జలదిగ్భందంలో చిక్కుకుంది. రాయపూడి సమీపంలోని పెదలంక గ్రామం నీటమునిగింది. 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 100 మంది ఇళ్లపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిని హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. మరోవైపు ఉండవల్లి కరకట్టకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది. మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద కరకట్టకు గండి పడింది. పూడ్చే ప్రయత్నాలు ఫలించడం లేదు. పెద్ద ఎత్తున కృష్ణాకు వరద ప్రవాహం రావడంతో రాజధాని గ్రామాలు ముంపు ముంగిట నిలిచాయి.
పెదలంకలో 300 పాడి గెదెలు వరదలో కొట్టుకుపోయాయి. వీటి విలువ రూ.5 కోట్లదాకా ఉంటుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 9 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద కిందికి వదులుతున్నారు. వరద ఇంకా పెరిగే ప్రమాదం ఉందని సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాడేపల్లి మహానాడు ప్రాంతం నీట మునిగింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీట మునిగిన కాలనీల ప్రజలను తరలించేందుకు వందలాది ట్రాక్టర్లు, 40 మరపడవలు, 5 హెలికాఫ్టర్లు రంగంలోకి దింపారు. వరద ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఐఏఎస్ అధికారిని నియమించారు. ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.