ఏపీలో వరద బీభత్సం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో లోతట్టు ప్రాంతాల లంక ప్రజలను పునరావాస శిబిరానికి తరలిస్తోన్న పడవ గల్లంతైంది. అందులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆరుగురిని స్థానికులు అతికష్టంమీద కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
విజయవాడ నగరం ఇంకా ముంపులోనే ఉంది. దాదాపు 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. 90 వేల మందికి ఆహార పొట్లాలు అందించారు. అనేక కాలనీల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. ఇప్పటికే 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందిస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో పాలసరఫరా నిలిచిపోయింది. కూరగాయల ధరలు కొండెక్కాయి.
బుడమేరు పొంగడంతో 47 కాలనీలు నీటమునిగాయి. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తేయడంతో బుడమేరు పొంగిప్రవహిస్తోంది. విజయవాడ రాయనపాడు వద్ద పట్టాలపైకి నీరు చేరింది. 83 రైళ్లు రద్దు చేశారు. పలు రైళ్లు దారి మళ్లించారు. జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కోదాడ సమీపంలో జాతీయ రహదారిపైకి 3 అడుగుల మేర నీరు చేరింది. గుంటూరు విజయవాడ మధ్య కాజా టోల్ గేటు సమీపంలో వరద ముంచెత్తింది. గుంటూరు, పల్నాడు, ఎన్డీఆర్, కృష్ణా జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. రెండు రోజుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. 10 లక్షలు దాటితే కరకట్టలు తెగే ప్రమాద ముంది. ఉండవల్లి సీఎం నివాసం వద్ద కరకట్టకు రంద్రం పడింది. రైతులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. కొండవీటి వాగుపొంగడంతో లిప్ట్ మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు.