వాయుగుండం వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంటనష్టం తీవ్రంగా ఉంది. మొత్తంగా రాష్ట్రంలోని 20 జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఉంది.
వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు 4లక్షల 10వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి, పత్తి, మిరప, కంది, పెసర, మినుము, మొక్కజొన్న పంటలు నాశనమయ్యాయి. రెండు నుంచి మూడు రోజులుగా వాననీరు పొలాల్లో నిలిచిపోయింది. దాంతో పైర్లు కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. కూరగాయల సాగు కూడా భారీగా దెబ్బతింది.
కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో వరదనీరు పొంగిపొర్లుతోంది. దాంతో వరి, పత్తి వంటి పంటలు సాగుచేస్తున్న పొలాల్లో నీరు ప్రమాదకరంగా చేరింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వరి పంట నాశనమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి, మిరప సాగు దెబ్బతింది. రాయలసీమ జిల్లాల్లో కంది, మొక్కజొన్న రైతులు అధికంగా నష్టాలు చవిచూసారు.
ప్రాంతాలు, పంటల వారీగా నష్టం వివరాలు పూర్తిగా తెలియడానికి మరికొంత సమయం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.