ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
అన్ని విద్యాసంస్థలు ఖచ్చితంగా సెలువు ప్రకటించాల్సిందేనని తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు తోడు వాగులు, వంకలు పొంగడంతో పలు నివాసాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని సింగ్ నగర్, ఇబ్రహీంపట్నంలో పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దాదాపు లక్షమంది వరదను ఎదుర్కొంటున్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ రాత్రి ఎన్టీఆర్ కలెక్టరేట్ లో బస చేశారు. అర్ధరాత్రి సమయంలోనూ పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు , ఒకరు గల్లంతు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.