ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబుతో మాట్లాడి తెలుసుకున్నారు. చంద్రబాబుకు ఫోన్ కు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన వరద సహాయ చర్యలను ప్రధానికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. నష్టం జరిగిన తీరును తెలిపారు.
స్పందించిన ప్రధాని మోదీ.. ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలను ఆదేశించామని, ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహాయం చేయాలని చెప్పినట్లు తెలిపారు. తక్షణమే ఆయా శాఖల నుంచి ఏపీకి అవసరమైన సామగ్రి అందుతుందన్నారు. ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదులు తెలిపారు.
అంతకు ముందు కేంద్రహోంమంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అవసరమైన సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు హెలీకాఫ్టర్లు కేటాయించారు. నేడు హెలీకాప్టర్లు రంగంలోకి దిగుతాయి.