వరదలతో విజయవాడలోని పలు కాలనీల్లో హృదయ విదారకంగ పరిస్థితి మారింది. స్థానికుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వరద దాటే ప్రయత్నంలో ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని తరలించలేక కారు టాప్ పై పెట్టి వదిలేశారు. చుట్టూ నీళ్ళు చేరడంతో తీవ్ర ఆందోళనలో స్థానికులు ఉన్నారు.
విజయవాడలోని పలు కాలనీలు నీట మునగడంతో సీఎం చంద్రబాబు సహాయ చర్యలను మరోసారి పర్యవేక్షించారు. అధికారులతో కలిసి సింగ్ నగర్ లో పర్యటించారు. బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అందరినీ సహాయ శిబిరాలకు తరలించి తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు మీతోనే ఉంటానని స్థానికులకు తెలిపారు.
విజయవాడలో గంటగంటకూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. బుడమేరు పొంగడంతో విజయవాడ నగరంలోకి భారీగా వరద వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్థానికులు అంటున్నారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలను శిబిరాలకు తరలించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.