హమాస్ ఉగ్రవాదులు మరో దురాగతానికి పాల్పడ్డారు. కాల్పుల విరమణకు చర్చలు సాగుతోన్న వేళ హమాస్ ఉగ్రవాదులు ఆరుగురు బందీలను చంపేశారు. పాలస్తీనా రఫా నగరంలోని ఓ సొరంగంలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఇజ్రాయెల్ దళాలు సోదాలు చేస్తుండగా రఫా ప్రాంతంలోని ఓ సొరంగంలో ఆరుగురు బందీల మృతదేహాలు వెలుగుచూసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. వీరిలో ఒకరు ఇజ్రాయెల్ అమెరికన్‌గా గుర్తించారు. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్, వీరిని బందీలుగా చేసుకుంది. అప్పటి నుంచి వీరిని చిత్రహింసలకు గురిచేశారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
పాలస్తీనాలో పోలీయో వ్యాక్సిన్ వేసేందుకు మూడు రోజుల కాల్పుల విరమణ సాగుతోంది. ఇలాంటి సమయంలో హమాస్ ఉగ్రవాదులు బందీలను చంపివేయడంతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తలు పెంచేలా చేసింది. అమెరికన్‌ను చంపడంతో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి హమాస్ 1200 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్దంలో నేటి వరకు 40691 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారని ఆ దేశ ప్రతినిధులు ప్రకటించారు. యుద్ధం ఆపేందుకు పలు దేశాలు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదు. బందీలను పూర్తిగా విడిచిపెడితేనే కాల్పుల విరమణ చర్యలు ముందుకు సాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హమాస్ (hamas war) కీలక ఉగ్రనేతలు హతమయ్యాక, హెజ్బొల్లా కూడా యుద్ధంలోకి దిగింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.