నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల సంఖ్యలో విద్యార్ధులు కలుషిత ఆహారం తిని అనారోగ్యం భారిన పడిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహనరావు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీలతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆహారంలో నాణ్యత పెంచడం, వంటశాల శుభ్రత, కళాశాలలో వెంటనే చేపట్టాల్సిన మరమ్మతులు, డ్రగ్, పొగాకు రహితంగా క్యాంపస్‌ను తీర్చి దిద్దేందుకు కమిటీ కృషి చేయనుంది. విద్యార్థుల కోసం వెల్నెస్ కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో (nuziwid iiit) నిత్యం విద్యార్థులు అస్వస్థతకు గురికావడం, మెస్ నిర్వహణపై ఫిర్యాదులు రావడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నెల రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దేలా ఆదేశాలు జారీ చేశారు.