అతి భారీ వర్షాలు ఏపీని ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో అతి భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. మంగళగిరిలో అత్యధికంగా 34 గంటల్లో 28 సెం.మీ వర్షపాతం నమోదైంది. విజయవాడలో 23 సెం.మీ వర్షం కురిసింది. గడచిన రెండు దశాబ్దాల్లో ఇదే అది పెద్ద వర్షపాతమని అమరావతి వాతావరణ శాఖ (amaravati weather report)వెల్లడించింది. అతి భారీ వర్షాలకు నంబూరు చెరువు పొంగిపొర్లుతోంది. విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపైకి వరద చేరింది. కాజా టోల్ గేటు వద్ద రెండు అడుగుల మేర వరద చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరకోస్తాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 6 నుంచి 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాయుగుండం కళింగపట్నం వద్ద కొద్ది గంటల్లో తీరందాటే అవకాశముందని ఐఎండి తెలిపింది. రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విజయవాడను అతి భారీ వర్షాలు (heavyrains) ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు సహా పలు కాలనీలు నీట మునిగాయి. బుడమేరుకు భారీగా వరద చేరుతోంది. కొండపల్లి, ఇబ్రహీంపట్నం జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. విజయవాడ జగదల్‌పూర్ జాతీయ రహదారిపైకి వరద చేరింది. గుంటూరు జిల్లా ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు చనిపోయారు.