మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
విజయవాడ, గుంటూరులో కుండపోత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ అర్ధరాత్రికి తీరం దాటనుంది. విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం అంచనా వేసింది.దీనికి తోడు రుతుపవన ద్రోణి వల్ల 48 గంటలుగా వాన దంచి కొడుతోంది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా తెనాలిలో 17.8, మంగళగిరిలో 15.4, ఏలూరు జిల్లా నూజివీడులో 15, బాపట్ల జిల్లాలో 11, పల్నాడు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్ష ప్రభావం అంచనాకు మించి ఉండటంతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణ సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. వానల కారణంగా రాష్ట్రంలో 8 మంది చనిపోయారు. వీరి కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
విజయవాడలో కుండపోత….
విజయవాడలో ఎటుచూసిన నీళ్ళే కనిపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులపై వరద పారుతోంది. రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు చాలా సేపు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్ స్టేషన్ చెరువును తలపించింది. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు.
గుంటూరులోనూ కుమ్మేసిన వాన
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ టోల్ గేట్ వద్ద వరద రోడ్డుపై ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో టోల్ గేట్ వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే వాహనాలను పంపించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనాలు కొట్టుకుపోయే స్థాయిలో వరద రోడ్డుపై ప్రవహిస్తోంది.