గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. దీంతో అటువైపు రావొద్దని పోలీసులు సూచించారు. మరోవైపు పెదకాకాణి వద్ద ఓ కారు వాగులోకి కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నీట మునిగి చనిపోయారు. స్థానికులు వాగులోకి దిగి మృతదేహాలను వెలికి తీశారు.
ఉప్పలపాడుకు చెందిన ఉపాధ్యాయుడు నంబూరు స్కూలులో పనిచేస్తున్నాడు. స్కూలుకు వాన కారణంగా సెలవు ప్రకటించడంతో మరో ఇద్దరు విద్యార్థులను కారులో ఎక్కించుకుని ఉప్పలపాడు వైపు వెళుతుండగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద దాటికి కారు కొట్టుకుపోవడంతో ఉపాధ్యాయుడు సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
గడిచిన 20 ఏళ్ళలో నేడు కురిసిన వాన అతిపెద్దదని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలోని పెద్ద పెద్ద చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.