అతి భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తాయి. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పెద్ద బండరాళ్లు రెండు ఇళ్లపై పడటంతో నలుగురు చనిపోయారు. సున్నపుబట్టీల ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 18 గంటలుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు కొండలు నాని బండలు ఇళ్లపై పడుతున్నాయి. కొండ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
గడచిన 18 గంటల్లోనే విజయవాడ నగరంలో 23 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణా స్థంభించిపోయింది. బస్సులు రద్దు చేశారు. నెహ్రూ బస్టాండ్‌లోకి వరద ప్రవేశించింది. పలు బస్సులు నీట మునిగాయి. పంటకాలువ రోడ్డు, కండ్రిక, నున్న, రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో 3 అడుగుల వరద చేరింది. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.