ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు డాక్టర్ హత్య, అత్యాచారం విషయం తనకు తెలియదని లై డిటెక్టర్ పరీక్షల్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. డాక్టర్ హత్యాచారం జరిగిన తరవాత ఉదయం పది గంటలకు తనకు ప్రొఫెసర్ సుమిత్‌రాయ్ తపదర్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను స్నానం చేస్తుండటం వల్ల ఎత్తలేదన్నారు. తరవాత అతనికి కాల్ చేయగా విషయం తెలిసిందన్నారు. ఘటనా స్థలానికి 11 గంటలకు చేరుకునే సరికే అక్కడ పోలీసులున్నట్లు సందీప్ ఘోష్ వెల్లడించారు. డాక్టర్ హత్యాచారం విషయం తనకు తెలియగానే, ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్లనీయెద్దని చెప్పినట్లు తెలిపారు.
మృతురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారనే దానిపై సీబీఐ విచారణ జరుపుతోంది. పోలీసులు వచ్చే వరకు ఘటనా స్థలానికి ఎందుకు చేరుకోలేదని సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది.
ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పటికే సీబీఐ నలుగురు నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. అందులో అబద్దాలు, అసత్యాలు చెబుతున్నట్లు గుర్తించారు. మరికొందరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తోన్న నిరసన కొనసాగుతోంది. ఆర్జి కర్ ఆసుపత్రి వద్ద నిరసన వద్దకు ఓ సివిల్ వాలంటీర్ అతి వేగంగా తమపైకి బైక్‌పై దూసుకు వచ్చినట్లు జూనియర్ డాక్టర్లు ఫిర్యాదు చేశారు. అతని బండిపై కోల్‌కతా పోలీస్ స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు.