ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా యాతన పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం, విద్యుత్ వైర్లు తెగిపడటంతో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. వర్ష ప్రభావంతో సామాజిక పింఛన్ల పంపిణీ కూడా వాయిదా పడింది.
రేపు అనగా ఆగస్టు 1 ఆదివారం కావడంతో ఇవాళే పింఛను నగదు లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కుండపోత వానలతో పంపిణీకి తీవ్ర ఆటంకం ఏర్పడింది. సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. భారీ వర్షాలు ఉన్న ప్రాంతల్లో ఒకటి రెండు రోజులు సమయం తీసుకుని అందజేయాలని సూచించింది. ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టవద్దని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్ష ప్రభావం లేని చోటు అందజేయాలని స్పష్టం చేసింది.
వర్షాల నేపథ్యంలో చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దయ్యింది. ఓర్వకల్లులో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. వాన కారణంగా పర్యటన రద్దు అయింది.