భారత్-పాక్ యుద్ధంలో మేజర్ భాస్కర్ రాయ్ సాహసం:
1965 సెప్టెంబర్ 1న భారత్-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయం. ఛంబ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించేందుకు ప్రయత్నించింది. అక్కడ కాపు కాస్తున్న భారత మేజర్ భాస్కర్ రాయ్ ఆరోజు చూపించిన ధైర్యసాహసాలకు భారత ప్రభుత్వం ఆయనను మహావీరచక్ర పురస్కారంతో సత్కరించింది. ఆరోజు పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్’ ప్రారంభించింది. ఆ ఆపరేషన్ లక్ష్యం అఖ్నూర్ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జిని స్వాధీనం చేసుకుని భారత సైన్యానికి సరఫరాలను అడ్డుకోవడం. దానివల్ల జమ్మూ ప్రాంతంలోని భారత సైనిక బలగాలకు సమస్యలు కలిగించాలన్నది పాకిస్తాన్ కుట్ర. ఆ ప్రయత్నంలోనే ఛంబ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. కానీ అక్కడ భారత సైన్యంలో మేజర్ భాస్కర్ రాయ్ ఉన్నారు. ఆయన ఒక్కడే పాకిస్తాన్‌కు చెందిన 13 యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేసేసారు. ఛంబ్ దగ్గర జరిగిన యుద్ధంలో మన సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి వారి ఆశల మీద నీళ్ళు జల్లడమే కాదు, వారిని యుద్ధం మానేసి పారిపోయేలా చేసింది. ఆ యుద్ధంలో మేజర్ భాస్కర్ రాయ్ చూపిన ధైర్యసాహసాలు, శౌర్య పరాక్రమాలను భారత ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారంతో సన్మానించింది.
రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం:
1939లో ఈరోజు రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో దాదాపు ప్రపంచంలోని ప్రసిద్ధ శక్తులన్నీ పాల్గొన్నాయి. ఆరు సంవత్సరాల పాటు కొనసాగిన ఆ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని చాలా దేశాలు నాశనమైపోయాయి. మొదట ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశలుండేవి, కానీ కొన్ని దశాబ్దాలలోనే రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యలు, ఉద్రేక స్వభావాలూ రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసాయి. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయిన జర్మనీ సంధి పేరిట ఎన్నో షరతులు, అవరోధాలూ ఎదుర్కోవలసి వచ్చింది. వాటి కారణంగా జర్మనీలో తీవ్ర అసంతృప్తీ, అస్థిరతా నెలకొన్నాయి. 1933లో అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ అధికారంలోకి వచ్చాక జర్మనీలో అతివాద జాతీయవాదం ప్రబలిపోయింది. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలండ్‌ను ఆక్రమించడంతో రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. మొదట బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి, తర్వాత మరెన్నో దేశాలు ఆ యుద్ధంలో చేరాయి. అలా అది రెండో ప్రపంచయుద్ధంగా మారింది.
భారత జీవితబీమా కార్పొరేషన్ స్థాపన:
1956లో ఇదేరోజు ఎల్ఐసిని స్థాపించారు. అందుకే ఈ రోజును భారతీయ జీవితబీమా సంస్థ స్థాపనాదినంగా జరుపుకుంటారు. ఎల్ఐసి భారతదేశంలోని అతిపెద్ద, అతి పాత జీవితబీమా సంస్థ. స్వతంత్రానికి ముందు దేశంలో ఎన్నో ప్రైవేటు బీమా సంస్థలు ఉండేవి. అవి వినియోగదారులను మోసం చేసే సంఘటనలు ఎక్కువగా ఉండేవి. ఆ నేపథ్యంలో అప్పటి భారత ప్రభుత్వం బీమా వ్యాపారాన్ని జాతీయీకరణ చేయాలని నిర్ణయించింది. 1956లో ప్రభుత్వం భారత జీవితబీమా చట్టం చేసింది. దాని ప్రకారం 245 ప్రైవేటు కంపెనీలు, ప్రావిడెంట్ సొసైటీలను విలీనం చేసి భారతీయ జీవితబీమా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దాని ప్రధాన ఉద్దేశం ప్రజలకు బీమా సౌకర్యం, భద్రత గురించి ప్రచారం చేయడం. దేశం నలుమూలల్లోనూ ప్రజలను భవిష్యత్తులోని అనిశ్చితి నుంచి రక్షించడానికి ఆర్థిక భద్రత కలగజేయడం ఈ బీమా లక్ష్యం.
టైటానిక్ శిథిలాలు దొరికిన రోజు:
1985లో ఈరోజు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలు దొరికాయి. టైటానిక్ అనేది బ్రిటిష్ పర్యాటక నౌక. 1912 ఏప్రిల్ 15న అది ఒక గ్లేసియర్‌ను గుద్దుకుని సముద్రంలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో 1500 కంటె ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్‌ను ‘కలల ఓడ’గా అభివర్ణించేవారు. ఆ కాలంలో అది అతిపెద్దదీ, అత్యంత విలాసవంతమైనదీ అయిన ఓడగా పేరుగాంచింది. 1912 ఏప్రిల్ 10న బ్రిటన్‌లోని సౌదాంప్టన్ నుంచి దాని మొదటి ప్రయాణం మొదలైంది. అమెరికాలోని న్యూయార్క్ వెళ్ళవలసిన ఆ ఓడ ఏప్రిల్ 14 రాత్రి ప్రమాదానికి గురై, మునిగిపోయింది. అప్పట్లో జరిగిన అతిపెద్ద సముద్ర ప్రమాదాల్లో టైటానిక్ ప్రమాదం ప్రధానమైనది. దాని శిథిలాలను అన్వేషించడం ఓ పెద్ద సవాల్‌గా మారింది. నిజానికి 73ఏళ్ళపాటు వాటిని వెతకడమే జరగలేదు. చివరికి అమెరికాకు చెందిన సముద్ర అన్వేషకుడు రాబర్ట్ బైలార్డ్ బృందం 1985 సెప్టెంబర్ 1న ఆ చరిత్ర ప్రఖ్యాత నౌక శిథిలాలను అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో కనుగొంది.
జాతీయ పోషకాహార వారం:
భారతదేశంలో ప్రతీయేడాదీ సెప్టెంబర్ 1 నుంచి వారం రోజుల పాటు ‘జాతీయ పోషకాహార వారం’గా జరుపుకుంటారు. ఈ వారం రోజులూ భారత ప్రభుత్వం దేశప్రజలకు పోషకాహారం ఆవశ్యకత గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది. సమతుల ఆహారం స్వీకరించడం వల్ల లాభాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు. భారత ప్రభుత్వం 1982 సెప్టెంబర్ 1 నుంచీ ఈ జాతీయ పోషకాహార వారాన్ని ప్రవేశపెట్టింది. దాని లక్ష్యం పోషకలేమిని అరికట్టడమే. ప్రత్యేకించి గర్భవతులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, వారు ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే. ఈ వారం రోజులూ ప్రభుత్వం ప్రజలను పలు కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడిపేలా ప్రోత్సహిస్తుంది. దానివల్ల పోషకాహార లోపం సమస్యలు తగ్గి, ఆరోగ్యవంతమైన సమాజం దిశగా ముందడుగులు పడతాయి.