విజయవాడ క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగి పడి ఓ మహిళ చనిపోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొండచరియల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 15 గంటలుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో విజయవాడలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. సున్నపు బట్టీల ప్రాంతంలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది.
విజయవాడ కొండప్రాంతాల్లోని (vijayawada landslides) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ హెచ్చరించారు. అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటకాలువ రోడ్డులో 3 అడుగుల నీరు చేరింది. కండ్రిగ, మ్యాంగో మార్కెట్ ప్రాంతాల్లో రోడ్లపై 2 అడుగుల మేర నీరు చేరింది. విజయవాడ జబల్పూర్ జాతీయ రహదారిపై కూడా వరద చేరడంతో రవాణా స్థభించింది. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.