భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీలో పలు ప్రాంతాలను ముంచెత్తాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్రరాంధ్రలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో 16 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏజన్సీ ప్రాంతాలకు రవాణా స్థంభించిపోయింది. విశాఖ జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ శనివారం సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో 13 సెం.మీ వర్షపాతం నమోదైంది. విజయవాడలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 12 గంటలుగా ఎడతెరపిలేని వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. జి.కొండూరు మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం (amaravati weather report) హెచ్చరించింది.