పారాలింపిక్ ఛాంపియన్ అవనీ లేఖారా ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కూడా విజయవిహారం కొనసాగించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో విజేతగా స్వర్ణపతకం గెలుచుకుంది. మరో భారతీయ షూటర్ మోనా అగర్వాల్ అదే పోటీలో కాంస్యపతకం సాధించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం, కాంస్యం… రెండు పతకాలు సాధించడంతో భారత బృందం పారాలింపిక్స్ ప్రదర్శన ఘనంగా మొదలైంది. పోటీ ప్రారంభం నుంచి చివరివరకూ అవని, మోనా ఇద్దరూ టాప్‌లోనే ఉన్నారు. స్వర్ణ పతకం మీద కన్నేసారు.
చివరికి అవనీ లేఖారా తన అనుభవంతో ఈవెంట్‌లో ఆధిపత్యం సాధించింది. 249.7 పాయింట్లతో అగ్రస్థానమూ, బంగారు పతకమూ గెలుచుకుంది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన కావడం విశేషం.
దక్షిణ కొరియాకు చెందిన యూన్రీ లీ 246.8 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో మూడోస్థానాన్ని, కాంస్య పతకాన్నీ దక్కించుకుంది.
అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో మోనా 623.1 పాయింట్లతో ఐదో స్థానం సాధించింది. 625.8 పాయింట్లు సాధించిన అవని రెండో స్థానంలో నిలిచింది. చివరికి ఫైనల్స్‌లో భారతీయ మహిళలు ఇద్దరూ రెండు పతకాలు గెలిచి మువ్వన్నెల పతాకం ఎగరేసారు.