పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు చెందిన 17ఏళ్ళ యువకెరటం శీతల్ దేవి అద్భుతమైన ప్రారంభం చేసింది. చేతులు లేకుండా ఆర్చరీలో ఆడుతున్న ఒకే ఒక్క అంతర్జాతీయ క్రీడాకారిణి శీతల్ దేవి. 720కి గాను 703 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు బద్దలుగొట్టింది.
మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్లో క్వాలిఫికేషన్ రౌండ్లో గత ప్రపంచ రికార్డు 698 పాయింట్లుగా ఉంది. ఇవాళ క్వాలిఫికేషన్ రౌండ్లో ఆ రికార్డును తిరగరాసింది. రౌండ్ ప్రారంభం నుంచే ధాటిగా బాణాలు వేసిన శీతల్, ఆద్యంతం అదే జోరు కొనసాగించింది. తన తుదిప్రయత్నానికి చేరేసరికే గత ప్రపంచ రికార్డును దాటేసింది. 703 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
అయితే ఆ ఆనందం అక్కడితో ఆగిపోలేదు. కొద్దిక్షణాల్లోనే టర్కీ క్రీడాకారిణి కురుక్లు గర్డీ అద్భుతంగా ఆడి 704 పాయింట్లతో శీతల్ రికార్డును అధిగమించింది. దాంతో ఈ ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్లో టర్కీ ఆటగత్తె మొదటి స్థానంలో నిలవగా, శీతల్ రెండో స్థానం దక్కించుకుంది.
క్వాలిఫికేషన్ రౌండ్ తర్వాత ఇంకా మరికొన్ని రౌండ్లు ఉన్నాయి. వాటిలో విజయం సాధించి తుదివిజయం సాధించే దిశగా శీతల్ దేవి ప్రస్థానం సాగుతోంది.