మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అందుకు తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. శివాజీ కేవలం మహారాజు మాత్రమే కాదని, ఆయన గౌరవనీయమైన వ్యక్తి అన్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్లో వద్వన్ ఓడరేవు,ఇతర ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, ఛత్రపతి శివాజీని తమ పూజ్య దైవంగా ఆరాధించే వారందరి మనోభావాలు ఈ విగ్రహం కూలిపోవడంతో దెబ్బతిని ఉంటాయాన్నారు. అందుకే తాను క్షమాపణలు చెబుతున్నానని వివరించారు. భారతీయ సంస్కృతి భిన్నమైనదన్న మోదీ, గౌరవనీయ వ్యక్తులు, దైవం కంటే గొప్పది ఏదీ లేదన్నారు.
గత ఏడాది నేవీ డే (డిసెంబర్ 4) నాడు సింధుదుర్గ్ జిల్లా మల్వాన్ తహసీల్‌లోని రాజ్‌కోట్ కోటలో ప్రధాని మోదీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఈ విగ్రహం నాలుగు రోజుల కిందట కూలింది. అదే స్థలంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పునర్నిర్మిస్తామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు.