కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు ఘటనపై కేసు విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్ళాలని ఆదేశించిన ముఖ్యమంత్రి, విద్యార్థుల ఆందోళనను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై వివరాలు తెలుసుకుంటున్నారు. విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను పరిగణలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అదే తరహాలో నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించారు. ఆందోళనలో ఉన్న విద్యార్థినులకు భరోసా కల్పించాలని సూచించారు.కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని ఆయన కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ప్రతీ మూడు గంటలకు ఒకసారి విచారణా పురోగతిపై తనకు రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర, కాలేజీకి వెళ్ళి విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.
కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదన్న విద్యార్థినులు, గత మూడు రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రికి చెప్పారు. న్యాయం చేయడానికి బదులు తమనే యాజమాన్యం బెదిరిస్తుందని వాపోయారు. తప్పు చేసినట్లు తేలితే కాలేజీ సిబ్బంది సహా యాజమాన్యంపై కూడా చర్యలు తప్పవని మంత్రి రవీంద్ర, విద్యార్థులకు వివరించారు. మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.