ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 15 తరవాత బదిలీలపై నిషేధం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే అనేక శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడం, గందరగోళం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల ఫించన్లు కూడా పంపిణీ చేయాల్సి ఉండటంతో సచివాలయ ఉద్యోగుల బదిలీలను నిలిపివేశారు.
ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసినా కొన్ని శాఖల్లో గందరగోళం నెలకొంది. కనీసం ఐదేళ్లు పనిచేసి ఉండాలనే నిబంధన సడలించాలని రవాణా శాఖ సిబ్బంది చేసిన ఒత్తిడి ఫలించలేదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఇప్పటి వరకు 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్లు, పోలీస్, రెవెన్యూ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో జరుగుతున్నట్లు తెలుస్తోంది.