శిరోమణి అకాలీదళ్ నాయకుడు, ఖలిస్తానీ వేర్పాటువాద అనుకూల నాయకుడు సిమ్రంజిత్ సింగ్ మాన్ బీజేపీ ఎంఎల్ఏ అయిన సినీనటి కంగనా రనౌత్‌పై అసహ్యకరమూ, వివాదాస్పదమూ అయిన వ్యాఖ్యలు చేసాడు. గతంలో రైతుల ఆందోళన సమయంలో అత్యాచారాలు జరిగాయని కంగనా చేసిన ఆరోపణకు స్పందనగా ఆయన ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదంగా మాట్లాడాడు.
‘‘నేను ఇలా మాట్లాడాలని అనుకోవడం లేదు. కానీ కంగనా రనౌత్‌కి అత్యాచారం విషయంలో చాలా అనుభవం ఉంది. రేప్ ఎలా జరుగుతుందో మీరు ఆమెను అడగండి. అప్పుడు ప్రజలందరికీ తెలియజేయవచ్చు. జనాలు సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు వాళ్ళకు సైకిల్ తొక్కిన అనుభవం వస్తుంది. అలాగే ఆమెకు అత్యాచారం అనుభవం ఉంది’’ అని సిమ్రంజిత్ సింగ్ మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్, సిమ్రంజిత్ సింగ్ మాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం లాంటి సున్నితమైన విషయాన్ని మామూలుగా జరిగే విషయంలా సాధారణీకరిస్తున్నారని మండిపడింది. ‘‘అత్యాచారాన్ని సాధారణీకరించడం ఈ దేశంలో ఎప్పటికీ ఆగేలా లేదు. ఇవాళ ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారానికి గురి అవడాన్ని సైకిల్ తొక్కడంతో పోలుస్తున్నాడు. ఈ పితృస్వామ్య దేశపు మనస్తత్వంలో అత్యాచారాలూ మహిళలపై హింసా వినోదం లాంటివని పాతుకుపోయిందంటే ఆశ్చర్యం ఏముంది? ఒక మహిళ ఎంత పెద్దస్థాయిలో ఉన్నా, రాజకీయ నాయకురాలైనా, దర్శకురాలైనా ఆమెను అవమానించడానికి చాలా సాధారణంగా ఆ మాట వాడేస్తున్నారు’’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
‘‘అత్యాచారం ఎలా ఉంటుందో కంగనకు తెలుసంటూ నన్ను బెదిరిస్తున్నారు. అవి అత్యాచారం చేస్తామన్న బెదిరింపులే. కానీ ఎంత బెదిరించినా అతను నా గొంతును అణగదొక్కలేడు. వాళ్ళు ఒక కళాకారిణిని, సినిమాల పట్ల నా సృజనాత్మక స్వేచ్ఛను అణిచేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని కంగనా ట్వీట్ చేసింది.
సిమ్రంజిత్ సింగ్ మాన్ వ్యాఖ్యలను హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేణు భాటియా ఖండించారు. మాన్ వ్యాఖ్యలు ‘మన కూతుళ్ళకు అవమానకరం’ అంటూ ఐదు రోజులలోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. పంజాబ్ మహిళా కమిషన్ కూడా, మాన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అటువంటి చెత్త వ్యాఖ్యలు అసలు విషయం తీవ్రతను తక్కువ చేస్తాయని అభిప్రాయపడింది.
కంగనా రనౌత్ ఇటీవల తన సినిమా ‘ఎమర్జెన్సీ’ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వాన్ని ప్రశంసించింది. బంగ్లాదేశ్‌లో హింసాకాండతో పోలుస్తూ, హర్యానాలో రైతుల ఆందోళనలను కేంద్రం ఎదుర్కొన్న విధానాన్ని మెచ్చుకుంది. బంగ్లాదేశ్ ఆందోళన సమయంలో జరిగిన నేరాల గురించి చెబుతూ ‘‘బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటనలు ఇక్కడ కూడా జరిగి ఉండగలిగేవి. శవాలు వేలాడాయి, అత్యాచారాలు జరిగాయి’’ అని కంగనా అంది.
అప్పటినుంచీ కంగనాకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఆమె సినిమా గురించి, రైతుల ఆందోళన మీద ఆమె వ్యాఖ్యల గురించి ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కొందరు ‘ఇన్ఫ్లుయెన్సర్లు’ ఆమెకు హాని తలపెడతామని హెచ్చరించారు. మరికొందరైతే ఇందిరాగాంధీకి పట్టిన గతే కంగనా రనౌత్‌కు కూడా పడుతుందంటూ పరోక్షంగా బెదిరించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు