ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024లో స్పష్టం చేశారు. గడచిన పదేళ్లలో ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీలు 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి, 500 శాతం వృద్ధి సాధించాయని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని మాదిరిగా భారత్‌లో స్టార్టప్ కంపెనీలు వేగంగా దూసుకెళుతున్నాయన్నారు.
ఫిన్ టెక్ ప్రతిరంగానికి విస్తరించిందని ప్రధాని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు ఫిన్ టెక్ సేవలు అందుతున్నాయన్నారు. దేశంలో 53 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరవడంతోపాటు, 27 లక్షల సూక్ష్మ రుణాలు అందించినట్లు గుర్తు చేశారు. జన్ ధన్ యోజన ప్రారంభించి పదేళ్లైందని, అందులో 70 శాతం మంది మహిళలు కావడం విశేషమన్నారు.
భారత్‌లో ఒకప్పుడు ఇంటర్నెట్ సేవలు సరిగా లేవు. నెట్ వేగం కూడా లేదు. అలాంటి సమయంలో ఫిన్ టెక్ రంగం ఎలా వృద్ధి చెందుతుందని తనను చాలా మంది ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. దేశంలో 6 కోట్ల నుంచి నెట్ వినియోగదారులు 94 కోట్లకు చేరినట్లు ప్రధాని మోదీ చెప్పారు.