కర్ణాటకలోని గంగావతి పట్నంలో విద్యుత్ స్తంభాలపై గద, ధనుస్సు చిహ్నాల మీద ముస్లిములు రగిల్చిన వివాదం కొనసాగుతోంది. ముస్లిం పార్టీ ఎస్‌డిపిఐ చేసిన డిమాండ్‌కి తలొగ్గి ఆ చిహ్నాలను తొలగించాలంటూ తహసీల్దారు మొదట ఆదేశాలు జారీ చేసారు. ఆ ఆదేశాలను తహసీల్దారు ప్రస్తుతానికి ఉపసంహరించారు.
గంగావతిలో ఇటీవల కొత్తగా వేసిన రోడ్డు మీద పాతిన విద్యుత్ స్తంభాలపై ధనుస్సు, బాణం, గద చిహ్నాలు ఉంచారు. అలాగే స్థానికులు ‘తిరుపతి తిమ్మప్ప’ అని పిలిచే వెంకటేశ్వరస్వామి పేరు రాసారు. గంగావతి పరిధిలోని అంజనాద్రి స్థానికంగా గొప్ప హిందూ పుణ్యక్షేత్రం. ఆంజనేయుడి జన్మస్థానం. అందుకే ఆ దారిలోని విద్యుత్ స్తంభాలను ఆ విధంగా తీర్చిదిద్దారు.
అయితే హిందూ వ్యతిరేకంగా వ్యవహరించే, ముస్లిముల రాజకీయ పక్షమైన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ విద్యుత్ స్తంభాల మీద రచ్చ చేసింది. అయోధ్య, తిరుపతిలో ఉన్నట్లుగా కరెంటు స్తంభాల మీద హిందూమత చిహ్నాలు గంగావతిలో పెట్టడం కుదరదంటూ ఫిర్యాదు చేసింది. వాటిని తొలగించకపోతే మతసామరస్యం దెబ్బతింటుందని హెచ్చరించింది.
ఎస్‌డిపిఐ అభ్యంతరాలకు స్పందించిన స్థానిక తహసీల్దారు నాగరాజు, ఆ స్తంభాలను తొలగించాలని, వాటిని అమర్చిన కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద కేసు పెట్టాలనీ పోలీసులను ఆదేశించారు. తహసీల్దారు ఆదేశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. వాటిపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన తన ఆదేశాలను ఆ సాయంత్రమే ఉపసంహరించారు. ఆ అంశాన్ని సంబంధిత శాఖకు రిఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
విద్యుత్ స్తంభాల వ్యవహారం గంగావతి మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుందని, ఆ ప్రతిపాదనను అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఆమోదించారని నాగరాజు వివరించారు. తనకు ఫిర్యాదులు అందినప్పుడు మతపరమైన ఉద్రిక్తతలను నివారించాలనే ఉద్దేశంతోనే ఆదేశాలు జారీ చేసానని చెప్పుకొచ్చారు. అయితే మునిసిపల్ కౌన్సిల్లో ఆమోదించాకే ఆ స్తంభాలు అమర్చిన సంగతి అప్పటికి తనకు తెలియదని వివరించారు. విషయం తెలిసినందున అనవసరపు విభేదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో తన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఇకపై భవిష్యత్తులో తీసుకునే చర్యలన్నీ కౌన్సిల్ మార్గదర్శకాలను బట్టి ఉంటాయని వివరించారు.
గంగావతిలోని అంజనాద్రి మీదనే ఆంజనేయుడు జన్మించాడని హిందువుల విశ్వాసం. ఆ ప్రాంతాన్ని తీర్థయాత్రా స్థలంగా అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దానిమీద ఎస్‌డిపిఐ రగడ చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. మతసామరస్యం చెడిపోతుందంటూ హెచ్చరించడం అంటే హిందువులపై ఘర్షణలకు పాల్పడతామని నేరుగానే బెదిరిస్తున్నారా అని మండిపడుతున్నారు. ఎస్‌డిపిఐ బెదిరింపులకు లొంగి కరెంటు స్తంభాలను తొలగించడం సరికాదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను గమనించి, తహసీల్దార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు అర్ధమవుతోంది.
విద్యుత్ స్తంభాలపై పెట్టిన చిహ్నాలు హిందూమతానికి చెందినవి, హిందూయేతరులు సైతం ఉండే గంగావతిలో అలాంటి చిహ్నాలు పెట్టడం లౌకికవాదానికి ప్రమాదకరం అంటూ ఎస్‌డిపిఐ వ్యతిరేకించింది. అయితే ఆ ప్రాజెక్టులో ప్రధాన వ్యక్తి అయిన మాజీ మంత్రి, ఎంఎల్ఎ జనార్దనరెడ్డి, కరెంటు స్తంభాలు తొలగించాలన్న ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అంజనాద్రిని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులో భాగంగా ఆ చిహ్నాలకు ప్రాధాన్యత ఉందని ఆయన వాదించారు. వాటిని తొలగించడం స్థానిక సంస్కృతిని, ఆ ప్రదేశపు ధార్మిక గుర్తింపునూ తక్కువ అంచనా వేయడమేననీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ చిహ్నాలు ఆ ప్రాంతానికి వచ్చే భక్తులకు దారి చూపడానికీ, ఆ ప్రాంతపు ధార్మిక ప్రాధాన్యతను చాటడానికేననీ వివరించారు. కరెంటు స్తంభాలపై చిహ్నాల వల్ల మత ఉద్రిక్తతలు నెలకొంటాయన్న వాదనలను కొట్టిపడేసారు.
హిందూ సంఘాలు జనార్దనరెడ్డి వాదనతో ఏకీభవించాయి. కరెంటు స్తంభాలపై చిహ్నాలను తొలగించకూడదని, ప్రాజెక్టును యథాతథంగా కొనసాగించాలనీ హిందూ సంఘాలతో పాటు స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థల, తిరుపతి, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాల్లో అలాంటి చిహ్నాలు సర్వసాధారణమనీ, ఇప్పుడు గంగావతిని అలాంటి తీర్థక్షేత్రంగా తీర్చిదిద్దే అవకాశం వచ్చిందనీ చెప్పుకొచ్చారు.
గంగావతి అర్బన్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు విలువ రూ.65కోట్లు. ఈ కరెంటు లైన్ ఆ ప్రాజెక్టులో భాగమే. అందులో భాగంగా జులాయ్నగర్ సర్కిల్ నుంచి ఆనెగొంది రోడ్డు వరకూ విద్యుత్ స్తంభాలు అమర్చడం ఆ ప్రాజెక్టులో భాగమే. ఇప్పటివరకూ 15 స్తంభాలు మాత్రమే నిలిపారు. ఈలోగా ఈ వివాదం తలెత్తడంతో ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. తహసీల్దారు ఇప్పుడు తన ఆదేశాలు ఉపసంహరించుకున్నందున భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచిచూడాలి. స్థానిక మునిసిపల్ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.