మహిళలు, విద్యార్థినులపై ఘోరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్రూంలో రహస్య కెమెరాల ఏర్పాటు పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై సీఎం చంద్రబాబునాయుడు విచారణకు ఆదేశించారు. వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సాయంత్రానికి ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్ రూంలో రహస్య కెమెరాలు పెట్టాడంటూ విజయ్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే ఈ వ్యవహారంపై విద్యార్థినులు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు విద్యార్థినులు తీవ్ర ఆందోళన చేశారు. అనుమానితుడు విజయ్ను విద్యార్ధినులు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను ఆన్ లైన్లో పెట్టి అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.