పోతన భాగవతం, నన్నయ్య భారతంలోని భక్తిరస పద్యాల పఠనాన్ని ప్రతీరోజు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్నారు. తెలుగు భాషా దినోత్సవం సంబరాల్లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. అమ్మవారికి పంచహారతులు ఇచ్చిన తర్వాత జరిపే వేదస్వస్తి అనంతరం పురాణ శ్రవణం కార్యక్రమంలో తెలుగు పద్యాలను కూడా పాడనున్నారు.
ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే ప్రారంభించారు. కృష్ణా గోదావరి ప్రాంతంలో ఉన్నతమైన సాహిత్యం వెల్లివిరిసిందని అందుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి సమక్షంలో తెలుగు పద్యాలు పఠిస్తే తెలుగు భాష మరింత పరిపుష్టమవుతుందని ఈవో కె ఎస్ రామరావు తెలిపారు.
అమ్మవారి హుండీ కానుకలు లెక్కింపు…
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల హుండీ కానుకలను అధికారులు లెక్కించారు. 18 రోజులకు గాను 2,76,66,261/ కానుకలు లభించినట్లు తెలిపారు. బంగారం రూపంలో 523 గ్రాములు, 7 కేజీల 30 గ్రాముల వెండి వస్తువులు, భక్తులు సమర్పించారు.
విదేశీ కరెన్సీలో భాగంగా 327 యూఎస్ఏ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, రెండు కువైట్ దినార్లు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, కెనడా డాలర్లు ఐదు, 25 యూరోలు, ఒక మలేసియా రింగ్గిట్స్ , పది సింగపూర్ డాలర్లు, 98 కతార్ రియాల్స్ హుండీ ద్వారా అమ్మవారికి సమర్పించారు.
హుండీ కానుకుల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ డీప్యూటీ ఈవో లీలా కుమార్, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు. online ఈ- హుండీ ద్వారా రూ.61,260/-లు భక్తులు అందజేశారు.