అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. తనని గెలిపిస్తే అవసరమైన మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తానని హామీ ఇచ్చారు. వైద్య బీమా కంపెనీలు ఐవీఎఫ్ ఖర్చులు బరించేలా చేస్తానని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో చాలా మంది సంతానంలేక ఆందోళన చెందుతున్నారు. వారి ఓట్లు కొల్లగొట్టేందుకు ట్రంప్ ఇచ్చిన హామీ కొంత వరకు ప్రయోజనం చేకూర్చే అవకాశముంది.
కృత్రిమ పద్దతుల ద్వారా అభివృద్ధి చెందిన అండాన్ని మహిళల గర్భసంచిలో ప్రవేశ పెడతారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికాలో ఒక దఫాకు కనీసం 10 వేల డాలర్లు ఖర్చు అవుతుంది. ఒక్కోసారి మూడు దఫాలు చేయించాల్సి ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా మంది సంతానం లేకపోయినా ఐవీఎఫ్ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఎన్నికల హామీల్లో ఐవీఎఫ్ చేరడం అమెరికాలో పడిపోతోన్న సంతానోత్పత్తిని తెలియజేస్తోంది.