భారత ప్రభుత్వం తాజాగా భారతీయ రైల్వే బోర్డుకు ఛైర్మన్, సిఇఒగా సతీష్ కుమార్ను నియమించింది. ఆ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న మొదటి ఎస్సి వ్యక్తి సతీష్ కుమార్. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్)లో ఉత్తమ అధికారుల్లో ఒకరైన సతీష్, సెప్టెంబర్ 1 నుంచీ రైల్వే బోర్డ్ ఛైర్మన్, సిఇఒగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న జయవర్మ సిన్హా ఆగస్టు 31న రిటైరవుతారు.
సతీష్ కుమార్ భారతీయ రైల్వేలకు 34 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. పలు జోన్లు, డివిజన్లలో కీలక పదవుల్లో పనిచేసారు. రైల్వేల్లో సమర్ధత, భద్రత పెంచడం కోసం ఆయన గొప్ప కృషి చేసారు. ఆయన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా 2022 నవంబర్ 8న ప్రయాగరాజ్ కేంద్రంగా నడిచే ఉత్తర మధ్య రైల్వేకు జనరల్ మేనేజర్ అయారు. ఇప్పుడు మొత్తం భారత రైల్వే బోర్డుకే అధిపతి అవుతున్నారు.
సతీష్ జైపూర్లోని మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ చేసారు. తర్వాత ఇగ్నో నుంచి ‘ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ సైబర్ లా’లో పిజి డిప్లొమా చేసారు. బలమైన విద్యానేపథ్యం, విస్తారమైన వృత్తినైపుణ్యం ఆయనను ఈ ఉన్నత స్థానానికి చేర్చాయి.
భారతీయ రైల్వేలు ప్రతీరోజూ రెండున్నర కోట్ల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరుస్తాయి. రోజుకు 20కోట్ల టన్నుల సామాన్లను రవాణా చేస్తాయి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడంలో రైల్వేలది కీలక పాత్ర.
విచిత్రం ఏమిటంటే బిజెపిని అగ్రకులాల పార్టీగా ముద్రవేసే కాంగ్రెస్, ఏకపక్షంగా కానీ సంకీర్ణంగా కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో వెనుకబడిన కులాలకు పెద్ద పీట వేయలేదు. మోదీ ప్రభుత్వం పలువురు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు సమున్నత పదవులిచ్చి వారిని సత్కరించింది.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడు ప్రొఫెసర్ దిలీప్ మండల్, సతీష్ కుమార్ నియామకం చారిత్రక ప్రాధాన్యతను ప్రశంసించారు. మోదీ ముందు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయాలెన్నో ఉన్నాయనీ, వాటిని సాధించే ప్రయత్నంలో భాగమే కుమార్ నియామకమనీ వ్యాఖ్యానించారు.
రైల్వే బోర్డు ఛైర్మన్ హోదాలో ఒక దళితుణ్ణి మొదటిసారి నియమించడం కీలకమైన విషయమన్న దిలీప్ మండల్ అభిప్రాయపడ్డారు. ప్రధానమైన ప్రభుత్వోద్యోగాల్లో సామాజిక న్యాయాన్ని, సమీకరణనూ ప్రోత్సహించడానికి మోదీ సర్కారు చేసిన, చేస్తున్న కృషిలో ఇది ప్రధానమైనదని వర్ణించారు.
గతంలో సాధ్యం కాని ఎన్నో అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో సాకారమవుతున్నాయి. దానికి తాజా ఉదాహరణ సతీష్ కుమార్ నియామకం. బడుగు, బలహీన వర్గాలకు సాధికారత ఇచ్చే దిశలో ఇదొక మేలిమలుపు. గమనిస్తే, ఒక ఎస్టీ మహిళను భారత రాష్ట్రపతిని చేయడమూ స్వతంత్ర భారత చరిత్రలో ఇదే మొదటిసారి. మోదీ సర్కారులో 27మంది ఓబీసీ మంత్రులకు చోటు కల్పించారు. ఒక ఎస్టీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవి దక్కడం కూడా మోదీ హయాంలోనే జరిగింది. ఒక ఎస్సీని నేషనల్ హైవే అథారిటీకి ఛైర్మన్గా నియమించారు. సుప్రీంకోర్టులో నలుగురు ఎస్సీ జడ్జీలు నియమితులైనది కూడా మోదీ పాలనా కాలంలోనే. పలు ప్రభుత్వ విభాగాల్లో మంత్రి పదవుల నుంచి ఎన్నో నాయకత్వ బాధ్యతలు బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. దళిత వర్గానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసారు. రికార్డు సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను పద్మ పురస్కారాలతో సత్కరించారు. ఒకప్పుడు ఢిల్లీలోని కులీన వర్గాలకు మాత్రమే పరిమితమైన పద్మ పురస్కారాలు ఇప్పుడు ఈ దేశపు మట్టిమనుషులను వరిస్తుండడం విశేషం.
రైల్వే బోర్డు ఛైర్మన్, సిఇఒగా సతీష్ కుమార్ నియామకం ప్రతిభకు, సామర్థ్యానికీ గుర్తింపుగా పలువురు కొనియాడుతున్నారు. 12లక్షలమంది ఉద్యోగులున్న భారతీయ రైల్వే వ్యవస్థ ఎక్కువమంది ఉద్యోగులున్న ప్రపంచంలోనే పెద్ద సంస్థల్లో ఒకటి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు