ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. నేటి సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ నెల 31న విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తీవ్ర అల్పపీడనం తీరం దాటిన అనంతరం మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణించి సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశముంది. దీంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా నేడు, రేపు వానలు కురిసే అవకాశముందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.