మరో ఘోరం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం రేగింది. ఓ సీనియర్ విద్యార్థి రహస్య కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించి అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతోన్న విద్యార్థి విజయ్‌కు రహస్య కెమెరాలు పెట్టడంతో ఓ విద్యార్థిని సహకరించినట్లు గుర్తించారు. విజయ్‌కు చెందిన ఫోన్లు, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై వారం కిందటే విద్యార్ధినులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు దిగారు. పోలీసులు సర్థిచెప్పడంతో వారు నిరసన విరమించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.