జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీగిరిలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆర్ధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు.
వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించిన తర్వాత స్వర్ణరథంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేశారు. ప్రతీనెలా ఆర్ధ్ర నక్షత్రం రోజున దేవస్థానం రథోత్సవం నిర్వహిస్తున్నారు.
రథోత్సవంలో జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, ఈవో డీ పెద్దరాజు దంపతులు, అర్చకస్వాములు,పండితులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్వర్ణరథం దాతలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు సైతం ఉత్సవంలో పాల్గొని ఆదిదంపతులను సేవించారు.