తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ, తెలుగు చాలా గొప్ప భాష అని, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిందన్నారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను స్మరించుకుందామని ట్వీట్ చేశారు. తెలుగు వెలగాలి- తెలుగు భాష వర్థిల్లాలి అని కోరుకుందామని పిలుపునిచ్చారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగువారికి శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు భాషను గౌరవించాలని నవతరానికి అమ్మభాష గొప్పదనాన్ని తెలియజేద్దామని ట్వీట్ చేశారు. విజయవాడలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మాతృభాష పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
తెలుగు వ్యవహార భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలుగు భాషలోని శాసనలు దొరికిన పలు చారిత్రిక ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుపుతున్నారు.