అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలతో ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలార్జించాయి. దేశీయ మార్కెట్లకు కూడా ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు వార్తలు సానుకూల సంకేతాలిచ్చాయి.
దేశీయ స్టాక్ సూచీలు మరో సరికొత్త రికార్డు నమోదు చేశారు. ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగిన స్టాక్ సూచీలు ఇవాళ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. 349 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 82134 వద్ద ముగిసింది. నిఫ్టీ (nifty 50) కూడా లాభాలతో రికార్డు నమోదు చేసింది. 99 పాయింట్ల లాభంతో నిఫ్టీ 25152 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో (sensex 30 index) బజాజ్ ఫిన్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసీ, టాటా మోటార్స్ లాభాలు ఆర్జించాయి. ఇక టాటా స్టీల్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టాలను చవిచూశాయి. రూపాయి మారకం విలువ డాలరుకు 83.86 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధర బ్యారెల్ 78.61 అమెరికా డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ( ounce pure gold rate ) 2546 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.