పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేశ్, ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు ఈ మేరకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్సై ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు తాఖీదులు జారీ చేశారు. వ్యక్తిగత వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఘటనపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరమన్నారు. ట్రాఫిక్ సమస్యపై సమీక్షకు పోలీసులను పిలవగా అదే సమయంలో పార్టీ కార్యకర్తలు పుట్టినరోజు వేడుక చేసేందుకు కేక్ తెచ్చారని వివరించారు. పోలీసులు అనుకోకుండా అక్కడ నిలబడటం యాదృచ్ఛికమన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
బదిలీల్లో జోక్యం, అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని ఆవేదన వ్యక్తం చేశారు.