దేశానికి రాజకీయ స్వతంత్రం వచ్చాక, లౌకికవాదం పేరిట హిందూసమాజానికి జరిగిన అన్యాయాలూ, క్రైస్తవులూ ముస్లిముల సంతుష్టీకరణా నేపథ్యంలో 1957లో నియోగి కమిషన్ నివేదిక వెలువడింది. హిందువులను మోసగించి, వంచించి, ఆశపెట్టి, ప్రలోభాలు చూపించి మతమార్పిడులు జరుగుతున్నాయని బైటపడింది. అయినా అప్పటి కేంద్రప్రభుత్వం మతమార్పిడులకు వ్యతిరేకంగా దేశమంతటా వర్తించేలా చట్టం చేయడానికి నిరాకరించింది. అదే సమయంలో విదేశాల్లో నివసిస్తున్న హిందువులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాల కోసం భారత్ వైపు చూస్తున్నారు. వారిని కూడా అప్పటి కేంద్రప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడంతో వారూ నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. అలాంటి సమయంలో హిందూ సమాజాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు, ధర్మాన్ని రక్షించేందుకు, హిందూ ధార్మిక సామాజిక సాంస్కృతిక విలువలను పరిరక్షించుకునేందుకు నేటికి సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం అంటే 1964 ఆగస్టు 29 విశ్వహిందూ పరిషత్ ఏర్పడింది.
ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబైలోని పోవై ప్రాంతంలో సాందీపని సాధనాలయ ఆశ్రమంలో ఒక సమావేశం జరిగింది. స్వామి చిన్మయానంద, సంత్ తుకాడోజీ మహరాజ్, మాస్టర్ తారాసింగ్ (సిక్కు), సుశీల్ ముని (జైన), గీతా ప్రెస్ వ్యవస్థాపకులు హనుమాన్ ప్రసాద్ పోద్దార్, కె ఎం మున్షీ వంటి హేమాహేమీలు ఆనాటి సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ సంస్థకు మూడు ప్రధాన లక్ష్యాలను నిర్ణయించారు. అవి…
1. హిందూ సమాజాన్ని జాగృతం చేయడం
2. హిందువుల హక్కులు, విలువలు, జీవన సూత్రాలను పరిరక్షించడం
3. విదేశాలలోని హిందువులకు అండగా నిలవడం
విశ్వహిందూ పరిషత్ మొదటి సమావేశం 1966 జనవరి 22-24 తేదీల్లో ప్రయాగలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో 12 దేశాల నుంచి 25వేల మంది పాల్గొన్నారు. శంకర పీఠాల ఆచార్యులు, 300మంది సాధువులు కలసి మత మార్పిడులను నిలువరించాలని, స్వధర్మంలోకి పునరాగమనాలను ప్రోత్సహించాలనీ నిర్ణయించారు. సంస్థకు మొదటి అధ్యక్షుడిగా మైసూరు మహారాజా చామరాజ వొడయార్, మొదటి ప్రధాన కార్యదర్శిగా దాదాసాహెబ్ ఆప్టే నియమితులయ్యారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది పరిషత్ నినాదంగా, అక్షయ వటవృక్షం పరిషత్ చిహ్నంగా స్వీకరించారు.
దేశంలోని సాధుసంతులు అందరూ కలసి, వేదాలు తదితర హిందూ ధార్మిక గ్రంథాల్లో అంటరానితనానికి చోటు లేదన్న సంగతిని ప్రకటిస్తే సమాజం నుంచి ఆ దురాచారం తొలగించవచ్చునని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆర్ఎస్ఎస్ చీఫ్ గురూజీ ప్రయత్నాల ఫలితంగా 1969 డిసెంబర్ 13-14 తేదీల్లో ఉడుపిలో జరిగిన ధర్మసంసద్‌లో సామాజిక సమరసత కోసం ఒక చారిత్రక తీర్మానం ఆమోదించారు. ‘హైందవః సోదరా స్సర్వే, న హిందు పతితో భవేత్ – హిందువులందరూ సోదరులే, హిందువుకు పతనం లేదు’ అన్నది ఆ తీర్మానం.
కాశీలో 1994లో జరిగిన ధర్మసంసద్‌లో స్వయంగా సాధుసంతులు దోమ్ రాజా ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. తర్వాత సదస్సు వద్ద ఆయనను ఆహ్వానించి పూలమాలలతో సత్కరించారు. ఆ సదస్సుకు 3500 మంది హాజరయ్యారు.
విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాల్లో గొప్పది గ్రామీణ పూజారి శిక్షణా కార్యక్రమం. గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, అత్యంత వెనుకబడిన కులాల వారు వేలాది మందికి గ్రామీణ పూజారులుగా శిక్షణ ఇచ్చారు. వారు వేలాది గ్రామాల్లో అర్చకులుగా నియమితులయ్యారు.
షెడ్యూల్డు కులానికి చెందిన కార్మికుడు కామేశ్వర్ చౌపాల్ 1989 నవంబర్ 9న శ్రీరామ జన్మభూమి నిర్మాణానికి పునాది రాయి వేసారు. ఇంకా సమరసతా యజ్ఞాలు, సమరసతా యాత్రలు, సమరసతా గోష్ఠులు ఎన్నో నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు హాస్టళ్ళు నిర్మించారు. అలా హిందూ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు విశ్వహిందూ పరిషత్ గణనీయమైన కృషి చేసింది. సామాజిక సమరసత కోసం కృషి చేసిన వాల్మీకి, సంత్ రవిదాస్, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వంటి గొప్పగొప్ప వ్యక్తుల వార్షికోత్సవాలను విహెచ్పి 2003 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
విశ్వహిందూ పరిషత్ రెండవ సదస్సు 1979 జనవరి 27-29 తేదీల్లో ప్రయాగలో నిర్వహించారు. 18 దేశాల నుంచి 60వేల మంది హాజరైన ఆ కార్యక్రమాన్ని దలైలామా ప్రారంభించడం ఒక చారిత్రక సందర్భం.
1970 మార్చి 27-29 తేదీల్లో అస్సాంలోని జోర్హాట్లో పరిషత్ సమావేశం జరిగింది. ఈశాన్యభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు, 45 నదీతీర ప్రాంతాల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. నాగా రాణి గైడిన్ ల్యూ కూడా ఆ ప్రాంతానికి చెందిన వీరవనితే. అటువంటి ఈశాన్య భారతంలో గిరిజన ప్రాంతాలే ఎక్కువ. భారతదేశపు ఆ భాగం మొత్తాన్నీ క్రైస్తవ మిషనరీలు తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. అలాంటి తరుణంలో ప్రకృతి ఆరాధకులైన గిరిజనులు హిందూసమాజంలో అంతర్భాగమని చాటుతూ పరిషత్ సమావేశం తీర్మానం చేసి ప్రకటించింది.
1982లో అశోక్ సింఘాల్ విశ్వహిందూ పరిషత్ అధికారి అయ్యారు. ప్రజలను జాగృతం చేయడానికి 1983లో ఆయన జరిపిన ఏకతా యాత్రలో 6కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. 1984లో ఢిల్లీలో మొదటిసారి ధర్మసంసద్ నిర్వహించారు.
సమాజంలోని విభిన్న వర్గాల సహాయంతో విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా 4500కు పైగా సేవా ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. వాటిలో 840 సంస్కార పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్లో 17వేల మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్వయంఉపాధి కేంద్రాలు, రెసిడెన్షియల్ హాస్టళ్ళు, అనాథ శరణాలయాలు, వైద్యకేంద్రాలు, కంప్యూటర్-టైలరింగ్-ఎంబ్రాయిడరీ తదితర శిక్షణా కేంద్రాలు కూడా పరిషత్ నిర్వహణలో ఉన్నాయి.
గోవుల రక్షణ, నిర్వహణ కోసం పరిషత్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దేశీయ ఆవుజాతులను అభివృద్ధి చేసే 60 కేంద్రాలను, పంచగవ్య ఆధారిత ఔషధాలను తయారు చేసే 40 కేంద్రాలనూ నిర్వహిస్తోంది. మరో మూడుచోట్ల పంచగవ్య పరిశోధనా కేంద్రాలు నడుపుతోంది. పరిషత్ కృషి 25లక్షల గోవులను వధించడాన్ని నిలువరించింది. పలు రాష్ట్రాల్లో గోవధకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు రూపొందాయి. గో-పాలన ద్వారా స్వయంసమృద్ధి సాధించవచ్చని ప్రోత్సహిస్తోంది. గో-పాలన ద్వారా ఆదాయం సంపాదించే మార్గాలను ప్రచారం చేస్తూ, దానికోసం ఋణాలు ఇప్పిస్తోంది.
అక్రమ మతమార్పిడులను నిరోధించడం, మతం మారిన వారిని మళ్ళీ తమ మూలాలకు అనుసంధానం చేయడంలో పరిషత్ గణనీయమైన కృషి చేసింది. సుమారు 40లక్షల మతమార్పిడులను నిలువరించింది. సుమారు 9లక్షల మందిని స్వధర్మంలోకి తీసుకొచ్చింది. బలవంతపు మతమార్పిడులు, లవ్‌జిహాద్ కుట్రలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు కఠినమైన చట్టాలు చేయడం వెనుక విశ్వహిందూ పరిషత్ కృషి లెక్కగట్టలేనిది.
భారతదేశం తీర్థయాత్రల దేశం. ఈ దేశపు ఆత్మ పవిత్రక్షేత్రాల్లో ఉంది. కావడి యాత్ర, కైలాస మానస సరోవర యాత్ర, అమరనాథ్ యాత్ర, గోవర్ధన పరిక్రమ, పూరీ జగన్నాథుడి నవ కళేబర యాత్ర, రామ-జానకీ వివాహ్ బారాత్ యాత్ర… వంటి తీర్థయాత్రల నిర్వహణలో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ధర్మయాత్రా మహాసంఘం కీలక పాత్ర పోషించింది.
‘వసుధైవ కుటుంబకం’ అనే సూత్రాన్ని అనుసరించే విశ్వహిందూ పరిషత్, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత, సంస్కృతీ పరిరక్షణ, హిందూ జీవన విధానాల కొనసాగింపు కోసం కృషి చేస్తోంది. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫిజీ, న్యూజీలాండ్, డెన్మార్క్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, తైవాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, సింగపూర్, నేపాల్, జర్మనీ తదితర దేశాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. ఆయా దేశాల్లో హిందూ పండుగలను ఘనంగా జరుపుకోవడంలో సహకరిస్తోంది.
విశ్వహిందూ పరిషత్ ఆరు దశాబ్దాల ప్రస్థానంలో, హిందూ సమాజాన్ని జాగృతపరిచే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. 1984లో మొదలైన రామజన్మభూమి ఉద్యమం దేశంలోని మారుమూల గ్రామాల నుంచి రాజధాని వరకూ 65కోట్ల మందిని ఏకీకృతం చేసింది. వారి గొంతుకలను వీధుల నుంచి సుప్రీంకోర్టు వరకూ వినిపించేలా చేసింది. 496 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
1995లో ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రను అడ్డుకుంటామని బెదిరించారు. అప్పుడు 51వేల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు, మరో లక్ష మంది ఇతర శివభక్తులు భారీ ర్యాలీ నిర్వహించి యాత్రికులకు రక్షణగా నిలిచారు. 2005లో బజరంగ్దళ్ బాబా బూఢా అమరనాథ్ యాత్రను పునఃప్రారంభించింది. దానివల్ల ఆ ప్రాంతాన్ని హిందువులు ఖాళీ చేసి వెళ్ళిపోవడం తగ్గుముఖం పట్టింది. ఆ ప్రాంతంలో హిందువులకు, భద్రతా బలగాలకూ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంక మేవాట్‌లో నల్లాహాడ్ మహాదేవ్ యాత్ర, కర్ణాటకలో దత్తపీఠ యాత్ర, అయోధ్య నుంచి జనక్‌పూర్ వరకూ రామ్-జానకీ బారాత్ (పెళ్ళి) యాత్ర వంటి తీర్థయాత్రల ద్వారా విశ్వహిందూ పరిషత్ సమాజంలో సమరసతను, ఐకమత్యాన్నీ కలిగించింది.
రామాయణ కాలంలో నలుడు, నీలుడు అనే వానరుల చేత భారత్-శ్రీలంక మధ్య నిర్మితమైన ‘రామ సేతు’ను పడగొట్టేందుకు మన్మోహన్ సింగ్ హయాంలోని యూపీయే ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలను అడ్డుకోడానికి, రామసేతును రక్షించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రజల సహకారంతో భారీ ఉద్యమమే నిర్వహించింది. రాముడి అస్తిత్వమే లేదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పినప్పుడు కేవలం నాలుగు గంటల్లో విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించింది. ఆ దెబ్బకు ప్రభుత్వం అదే రోజు దిగొచ్చింది. ఢిల్లీలోని స్వర్ణజయంతి పార్కు వద్ద రామభక్తులు పెద్దసంఖ్యలో ధర్నా నిర్వహించడంతో ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది.
విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం బజరంగ్ దళ్, మహిళా విభాగం దుర్గా వాహిని ఈ దేశాన్ని, మన ధర్మాన్ని, సంస్కృతిని, జాతినీ రక్షించే కార్యంలో ముందుండి పనిచేస్తున్నాయి. సేవ, రక్షణ, విలువలు… ఇవే ఆ సంస్థల మూలమంత్రాలు. సంస్కృత భాష, వేద విద్య, భారతీయ విలువలకు ప్రచారం చేయడం, ఆదరణ కల్పించడంలో విశ్వ హిందూ పరిషత్ ఎంతో కృషి చేసింది, చేస్తోంది.
ఇలా హిందూ సమాజ ఉద్ధరణ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఎన్నో మైలురాళ్ళు దాటింది. అయినప్పటికీ ఇంకా దాటవలసిన సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మతమార్పిడులు, లవ్‌జిహాద్, సామాజిక సమరసత, ధార్మిక స్థలాల ప్రభుత్వ ఆక్రమణలు, సంస్కృతి క్షీణత, ధార్మిక విద్య లేకపోవడం, విదేశీ చొరబాట్లు, ప్రాదేశిక జనాభాలో మార్పులు వంటి ఎన్నో సమస్యలు హిందూ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ వాటినుంచి విముక్తి సాధించి ముందడుగు వేసే దిశగా హిందూ సమాజాన్ని నిరంతరం నడిపించడం విశ్వహిందూ పరిషత్ విధ్యుక్త ధర్మం.