దక్షిణాఫ్రికా దేశం నమీబియా కరవు కోరల్లో చిక్కుకుంది. దాదాపు 14 లక్షల జనాభా తీవ్ర ఆహార, నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఇది మొత్తం జనాభాలో సగానికి సమానం. ఏనుగులు ఎక్కువ కావడంతో నీటి కొరత ఏర్పడిందని వాటిలో 87 ఏనుగులు, 300 జీబ్రాలు, అడవి దున్నలు, జిరాఫీలను చంపి ప్రజలకు ఆహారంగా ఇవ్వాలని నమీబియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా జంతువులు ఆహారం కోసం గ్రామాలపై దాడి చేయడం తగ్గడంతోపాటు, నీటి కొరత తీరుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
దక్షిణాఫ్రికాలో 2 లక్షల దాకా ఏనుగులు ఉన్నాయని అంచనా. ఒక్క బోట్స్వానాలోనే లక్షకుపైగా ఏనుగులు ఉన్నాయి. ఐదేళ్ల కిందట బొట్స్వానాలో ఏనుగుల వేట నిషేధించడంతో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. దీంతో బోట్స్వానాలో ఏనుగుల వేట నిషేధాన్ని ఎత్తివేశారు.
అడవి జంతువులను తగ్గిస్తే నీటి వనరులపై భారం తగ్గుతుందని ఆఫ్రికా దేశాలు భావిస్తున్నాయి. ఆహారం కోసం అడవి జంతువులు గ్రామాలు, పంటలపై దాడులు చేయడం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. దీనికితోడు ప్రజలకు ఆహారం కూడా లభిస్తుందని నమీబియా ఈ నిర్ణయం తీసుకుంది.