అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి (26) ప్రమాదవశాత్తూ ఓ సరస్సులో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన రూపక్ రెడ్డి, స్నేహితులతో కలిసి జార్జ్ లేక్‌కు వెళ్లాడు.
బోటు షికారు చేస్తూ నీళ్ళ మధ్యలో ఓ రాయిపైకి ఎక్కిన రూపక్ రెడ్డి సెల్ఫీ కోసం యత్నించాడు. అయితే అతడు పట్టు కోల్పోయి నీటిలో పడి ప్రాణాలు విడిచాడు.
స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. రక్షణ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి సరస్సు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు.
డెలవేర్‌లోని హారిస్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రూపక్ రెడ్డి ఎంఎస్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 8 నెలల కిందటే అతడు అమెరికా వెళ్లాడని చెప్పారు.