వ్యావహారిక భాషను జనాల వాడుకలోనుంచి పుస్తకాలలోకి తీసుకొచ్చి, రచనల్లో గ్రాంథిక భాషను పరిహరించి, సాహిత్యాన్ని జనజీవనం మాట్లాడుకునే సాధారణ వాడుకభాషలోకి తీసుకువచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.
భారతదేశంలోని ఆరు సంప్రదాయ భాషలలో ఒకటిగా ఉన్న తెలుగు భాష ప్రపంచంలో 14వ అత్యధికంగా మాట్లాడే స్థానిక భాష. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగువారు స్థిరపడిన విదేశాల్లో సైతం లెక్కవేస్తే సుమారు 10 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాషగా వెలుగొందుతోంది.
తెలుగుభాష గొప్పతనాన్ని విజయనగర సామ్రాజ్యాధినేత, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు జాను తెనుగులో ఎంతో అందంగా చెప్పుకొచ్చారు.
“తెలుగదేల యెన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స”
భారతీయ భాషలన్నింటికీ సంస్కృతమే మూలమైనా, వాటన్నింటిలో పూర్తిస్థాయి అజంత భాష తెలుగే. అంటే, తెలుగు భాషలోని పదాలన్నీ అచ్చులతోనే ముగుస్తాయి. ఐరోపా భాషల్లో అటువంటి లక్షణం ఇటాలియన్‌కు ఉంది. అందుకే, 15వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నాడు. తెలుగు సొగసైనది, శ్రావ్యమైనది, మధురమైనది, సంగీతానికి అనుకూలంగా ఉండే సుకుమారమైన భాష. అందుకే కర్ణాటక సంగీతంలో అత్యధిక కీర్తనలు, కృతులు, రచనలు తెలుగులోనే ఉంటాయి.
ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. ప్రత్యేకించి టెలివిజన్ కార్యక్రమాల్లో పరభాషా పదాల వాడుక పెరిగిపోతున్నది. ఆ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది.
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఇవాళ పలు స్వచ్ఛంద సంస్థలు తెలుగును ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సాహకాలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి జరుగుతోంది. తెలుగులోనే విద్యా బోధన, ప్రజా పరిపాలన కొనసాగాలని తెలుగు నాడు సమితి సుమారు పాతికేళ్ళుగా కృషి చేస్తోంది.